మునుగోడు ఉప ఎన్నిక.. నేటి సాయంత్రం ముగియనున్న ప్రచారం
Munugode Bypoll campaigning ends today evening.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది.
By తోట వంశీ కుమార్ Published on 1 Nov 2022 11:06 AM ISTమునుగోడు ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. నేటి(మంగళవారం) సాయంత్రంతో ప్రచారానికి శుభం కార్డు పడనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ముఖ్య నేతలు మునుగోడులో మకాం వేసి ప్రచార హోరును పెంచారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలను సంధించుకున్నారు. మోటార్లుకు మీటర్లపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మాటల యుద్దం కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, కేఏపాల్, స్వతంత్ర అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించారు.
ప్రచారానికి మరికొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి అన్ని పార్టీలు. ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లేసేలా ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. నేడు చివరి రోజు కావడంతో టీఆర్ఎస్ తరుపున మంత్రులు కేటీఆర్,హరీశ్‌రావులు రోడ్ షోలు నిర్వహించనుండగా, బీజేపీ బైక్ ర్యాలీలు, కాంగ్రెస్ మహిళా గర్జనను నిర్వహించనున్నాయి.
ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రచారానికి వచ్చిన స్థానికేతులు ఉండకూడదని, నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల ప్రధానికారి వికాస్ రాజ్ ఇప్పటికే వెల్లడించారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 298 పోలింగ్ బూత్‌లలో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 105 సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ పోలీంగ్ సజావుగా జరిగే ఏర్పాట్లను చేశారు. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి వీరిలో మునుగోడు ప్రజలు ఎవరిని కరుణిస్తారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.