తెలంగాణలో పుర సమరం ప్రారంభం
Municipalities elections in Telangana.గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు పలు పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది
By తోట వంశీ కుమార్ Published on 30 April 2021 7:35 AM IST
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలతోపాటు పలు పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల నిర్వహణలో కొవిడ్ నిబంధనలు అమలుచేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎన్నికల అధికారి, పురపాలకశాఖ కమిషనర్ సత్యనారాయణ, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు శివబాలాజీరెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యదర్శి అశోక్‌కుమార్, ఓఎస్డీ జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వారు, ఓటర్లు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలన్నారు. శానిటైజ్ చేసుకోవాలని.. పోలింగ్ కేంద్రం వెలుపల, లోపల భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ నిబంధనల పర్యవేక్షణకు బాధ్యతాయుతమైన అధికారిని నియమించాలి.
పోలింగ్, పోలీస్ సిబ్బందిని తరలించే వా హనాల్లో 50% మందినే అనుమతించా లి. ప్రతి మున్సిపాలిటీలో హెల్త్ నోడల్ అ ధికారులను, పోలింగ్ కేంద్రంలో ఇద్దరు ఆరోగ్య సిబ్బందిని అవసరమైన మెడికల్ కిట్లతో అందుబాటులో ఉంచాలి. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద షామియానాలు ఏర్పాటుచేసి, ఓటర్లకు కుర్చీలు వేయాలి. ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ధ్రువపత్రం అందుకోవడానికి అభ్యర్థితో పాటు మరొకరిని మాత్రమే అనుమతించాలన్నారు. మొత్తం 11,34,032 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.