వైఎస్ షర్మిలను చూస్తే జాలి వేస్తోంది
కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 24 Jan 2024 11:30 AM GMTకాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. షర్మిల దుష్టశక్తుల ట్రాప్‌లో ఉన్నారని, ఆమెను చూస్తే జాలివేస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో షర్మిల నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనెల 30న ఏలూరులో వైసీపీ ఎన్నికల సన్నాహక సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలకు, నాయకులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారని వెల్లడించారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏలూరులోని వైసీపీ కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా నేతలతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశం అయ్యారు.
ఇక వైఎస్ షర్మిలకు గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సవాల్ విసిరారు. ప్లేస్, డేట్, టైమ్ మీరే చెప్పండి.. వైసీపీ పాలనలో గురజాల రూపు రేఖలు ఎలా మారాయో చూపిస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన సమయంలో షర్మిల మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ది జరగలేదని అన్నారు. జగనన్న సైనికుడిగా, పల్నాటి పౌరుషం ఉన్న కాసు మహేశ్ రెడ్డిగా షర్మిల సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని అన్నారు. గుంటూరులోనో, విజయవాడలోనో కూర్చొని సవాల్ విసరడం కాదని, గురజాలకు వస్తే గల్లీగల్లీలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని అన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో సాగుతోందని అన్నారు.