తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే..! వైఎస్సార్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ వ్యవహారంపై చర్చ జరుగుతూ ఉండగా టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో షర్మిల పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరని.. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విషం చిమ్మడమే షర్మిల లక్ష్యమని ఆరోపించారు. షర్మిలకు తెలంగాణతో ఏం సంబంధమని, ఎవరి రాష్ట్రం వాళ్లదేనన్నారు. పక్క రాష్ట్ర సీఎంగా వైఎస్ జగన్ ను గౌరవిస్తామన్నారు. బయ్యారం గనులను దోచుకున్నది షర్మిల కుటుంబమేనని, తెలంగాణను దోచుకోవడానికే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని.. ఆంధ్రాలో పప్పులు ఉడకట్లేదనే తెలంగాణలో షర్మిల డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. షర్మిల తన మాటలు అదుపులో ఉంచుకోకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలను ఆపడం మా వల్ల కాదని అన్నారు. తెలంగాణకు రావాల్సిన విభజన చట్టం హామీల గురించి షర్మిల ఎందుకు మాట్లాడట్లేదని.. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణ రాజకీయాల గురించి షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.