బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ శనివారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లింగయ్య యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక అవినీతి ఒప్పందాలకు పాల్పడిందని అన్నారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గత 15 రోజులుగా లోక్‌సభ, రాజ్యసభల్లో నిరసనలు చేస్తున్నారు.. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. అయినప్పటికీ బీజేపీ దాని లోపాలను పట్టించుకోకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్‌కు ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రలలో పెరుగుతున్న మద్దతును చూసి బీజేపీ కంగారుపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలను బేరీజు వేసుకోవాలని హెచ్చరించారు.