తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని రేవంత్‌తో చెప్పినట్లు వెల్లడించారు. చౌటుప్పల్ రాజీవ్ భవన్‌లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ది అరాచక పాలన అని.. హిట్లర్ బతికి ఉంటే కేసీఆర్‌ను చూసి విలపించేవారని ఎద్దేవా చేశారు. కేవలం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే ఆయన సీఎంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, పెండింగ్ సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తే ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనని.. కావాలంటే బాండ్ పేపర్ పై రాసిస్తానని అన్నారు. తన నియోజకవర్గంలో పనులకు సంబంధించి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బకాయిలు పెట్టిందని కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిల్లులు రాక కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉందని వివరించారు.