బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించనని ఎంపీ అరవింద్ అన్నారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని సూచించారు. సంజయ్ వాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు ఎంపీ అరవింద్. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఆ హోదా పవర్ సెంటర్ కాదు.. అందరినీ సమన్వయం చేసే బాధ్యతని అన్నారు.
కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన కామెంట్స్.. వాళ్లకు ఓ ఆయుధంలా మారాయన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. కవిత ఈడీ విచారణకు సహకరిస్తే మంచిదని అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. లేకపోతే వీలైనంత త్వరలో కస్టడీలోకి తీసుకునే అవకాశముందని అన్నారు. అవినీతి రహిత దేశాన్ని రూపొందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అదే పని మీద ఉన్నాయని చెప్పారు. కుటుంబ పార్టీలు అవినీతిలో కూరుకుపోవడం జగమెరిగిన సత్యమని అన్నారు.