వివేకా హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విచారణను సీబీఐ మళ్లీ వాయిదా వేసింది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతుండడంతో బుధవారం ఆయన్ని విచారించాలని సీబీఐ నిర్ణయించుకుంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణ జరగాల్సి ఉంది. హైకోర్టులో విచారణ పూర్తికాలేదన్న విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ఈ తరుణంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సైతం కోర్టులోనే ఉండడంతో ఎవరు ప్రశ్నిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో విచారణను రేపు ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలియజేసింది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం హైకోర్టులో చాలా సేపు వాదనలు జరగగా, మధ్యాహ్నం 2.30 నిమిషాలకు తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక తిరిగి హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా ఇరువురి లాయర్లు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్ చెబుతుండగా, అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అంటోంది.