కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్దం అయిన సంఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీ కూతురు మృతి చెందారు. మెదక్ మండలం శివ్వాయిపల్లికి చెందిన తల్లీ కూతుళ్లు మంగ సంధ్యారాణి(43), మంగ చందన (23) ప్రాణాలు కోల్పోయారు. చందన బెంగళూరులో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. శివ్వాయిపల్లికి చెందిన మంగ ఆనంద్ కుమార్ గౌడ్ 2007 నుంచి మస్కట్ లో సాఫ్ట్‌వేర్ గా ఉద్యోగం చేస్తు భార్య సంధ్యారాణి తో కలిసి అక్కడే ఉంటున్నారు.
అయితే బంధువుల పెళ్లి కోసం కొద్ది రోజుల కిందట భార్యాభర్తలు ఆనంద్ కుమార్ గౌడ్, సంధ్య రాణి హైదరాబాద్ వచ్చారు. బంధువుల పెళ్లితో పాటు దీపావళి పండుగ కూడా ఉండటంతో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న వారి కూతురు చందన , అలహాబాద్ లో ఐఐటీ చదువుతున్న కొడుకు శ్రీ వల్లభ కూడా హైదరాబాద్ వచ్చారు. వారం రోజుల తర్వాత ఆనంద్ మస్కట్ తిరిగి వెళ్లిపోగా.. కొడుకు శ్రీ వల్లభ కూడా అలహాబాద్ వెళ్లిపోయాడు. అయితే సంధ్యారాణికి జ్వరం రావడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. దీపావళి తర్వాత కూతురు చందనను బెంగళూరులో వదిలిపెట్టి తాను తిరిగి మస్కట్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బెంగళూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాదం జరిగిన బస్సులోనే తల్లీ కూతురు ఉన్నారు