ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియుడి కోసం.. చిన్నారిని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిన తల్లి

ఇన్‌స్టాలో పరిచయమైన ఓ వ్యక్తి కోసం ఓ తల్లి తన కొడుకును వదిలేసి వెళ్లిపోయింది.

By అంజి
Published on : 28 July 2025 7:40 AM IST

Mother, Nalgonda bus stand, boyfriend, instagram, Telangana

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియుడి కోసం.. చిన్నారిని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిన తల్లి

ఇన్‌స్టాలో పరిచయమైన ఓ వ్యక్తి కోసం ఓ తల్లి తన కొడుకును వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి వరకు కళ్ల ముందు కనిపించిన అమ్మ.. ఒక్కసారిగా మాయవడంతో ఆ బాబు బస్టాండ్‌లో గుక్కపట్టి ఏడవడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆ చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఈ ఘటన నల్గొండ బస్టాండ్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బోడుప్పల్‌కు చెందిన ఓ వివాహితకు హాలియా మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనే వ్యక్తితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అతడిని కలిసేందుకు 18 నెలల కొడుకుతో కలిసి హైదరాబాద్‌ నుంచి ఆదివారం నాడు ఉదయం నల్గొండ బస్టాండ్‌కు వచ్చింది.

ఆ తర్వాత బాలుడిని అక్కడే వదిలేసి నరేష్‌తో కలిసి బైక్‌పై వెళ్లిపోయింది. తల్లి కనిపించకపోయేసరికి బాలుడు గుక్కపట్టి ఏడవడం మొదలు పెట్టాడు. వెంటనే ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాలుడిని చేరదీసి.. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళ బైక్‌పై వెళ్లినట్టు పోలీసులు సీసీ ఫుటేజీలో గుర్తించారు. బైక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని.. దీని ద్వారా మహిళతో పాటు నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు బాలుడిని మహిళ కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

Next Story