ధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు: పౌరసరఫరాల శాఖ
యాసంగిలో పండే ప్రతి ధాన్యం గింజనూ కొంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు.
By అంజి Published on 4 April 2024 7:30 AM GMTధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు: పౌరసరఫరాల శాఖ
యాసంగిలో పండే ప్రతి ధాన్యం గింజనూ కొంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో 56 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు చేసేందుకు 1967తో పాటు 1800 4250 0333 టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇప్పటికే 3134 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 2980 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.
ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్ని కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ధాన్యం సేకరణకు ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం సాఫ్ట్‌వేర్ ఉందని, రైతులు అమ్మిన ధాన్యం తూకం, గ్రేడింగ్ కొనుగోలు కేంద్రంలో సిబ్బందే వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించామని డీఎస్ చౌహాన్ తెలిపారు. ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు లేకుంటే.. తూకాన్ని తగ్గించే అధికారం డిప్యూటీ తహశీల్దార్, జిల్లా పౌరసరఫరాల శౄఖ అధికారులకు మాత్రమే ఉందన్నారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనవద్దని రైస్‌మిల్లర్లను ఆదేశించామన్నారు. వరికి రూ.500 బోనస్ ఇచ్చే విషయం రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయం యాసంగి సీజన్ ప్రారంభానికి ముందే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు.