మొగిలిగిద్ద సర్పంచ్, వార్డు సభ్యులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించారు. మొగలిగిద్ద ఎంపీటీసీ కోట శ్రీశైలం కూడా వారిలాగే రాజీనామా యోచనలో ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సంచలన నిర్ణయంతో మొగిలిగిద్ద వాసులు ఉలిక్కిపడ్డారు. తమ గ్రామం.. చారిత్రాత్మక గ్రామమని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. మొగిలిగిద్ద గ్రామాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ లలితతోపాటు ఉప సర్పంచ్ కుమ్మరి లావణ్య, వార్డు సభ్యులు తబ్రేజ్, రాగాపురం మణెమ్మ, మహమ్మద్ మహబూబ్ అలీ, శ్రీనివాస్, లోకేష్, పాండు, శ్యాంసుందర్ సుమతమ్మ నస్రిన్, శేఖరమ్మ, అనసూయ, శ్రీశైలం, శ్రీనివాసులు, విజయలక్ష్మిలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల కోర్కెలు తీర్చలేకపోతున్నామని.. పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని సర్పంచ్ లలిత, ఎంపీటీసీ శ్రీశైలం తదితరులు పేర్కొన్నారు.