రైతులకు కేంద్రం ఏ ఒక్క మంచి పని చేయలేదు

MLC Palla Rajeshwar Reddy Slams Center. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని రైతు బంధు సమితి చైర్మన్

By Medi Samrat  Published on  22 Nov 2022 7:45 PM IST
రైతులకు కేంద్రం ఏ ఒక్క మంచి పని చేయలేదు

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు కేంద్రం ఏ ఒక్క మంచి పని చేయలేదని విమ‌ర్శించారు. వ్యవసాయానికి రైతులను దూరం చేసే పనులు చేస్తోందని.. పీఎం కిసాన్ పథకం లబ్ది దారులను క్రమంగా తగ్గిస్తోందని మండిప‌డ్డారు. ఫిబ్రవరి 2019లో రాజకీయ లబ్ది కోసం ఈ పథకం తెచ్చారు. మొదట పీఎం కిసాన్ లబ్ది దారుల సంఖ్య 11 న్నర కోట్లు గా గుర్తించింది.. రాను రాను ఆ సంఖ్య మూడున్నర కోట్ల కు తగ్గించారని.. లబ్ది దారుల సంఖ్య తగ్గించి రైతుల ఉసురు తీసుకున్నారని విమ‌ర్శించారు.

మధ్య ప్రదేశ్ లో ఏకంగా 99 శాతం మందిని తగ్గించారు. ఛత్తీస్ ఘడ్ లో 94 శాతం తగ్గించారు. అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉందని అన్నారు. వ్యవసాయ కరెంటు మోటర్లకు మీటర్లు బిగించడంపై దేశ వ్యాప్తంగా పోరాటం మొదలైందని అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలప్పుడు ఒకటి చెప్పారు.. ఇపుడు మరొకటి చేస్తున్నారని.. అందుకే అక్కడి రైతులు రోడ్లపైకి వచ్చారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. మహారాష్ట్ర లో గత ఆరు నెలల్లో 1800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. మోదీకి లేఖలు రాసి మరీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

మూడు సాగు చట్టాల రద్దు చేసి రైతులకు క్షమాపణ చెప్పిన మోదీ.. అపుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దుయ్య‌బ‌ట్టారు. కనీస మద్దతు ధర కమిటీ లో అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్లనే వేశారని విమ‌ర్శించారు. దేశ వ్యాప్తంగా రైతులు మరో పోరాటానికి సిద్ధం అవుతున్నారని అన్నారు. కేంద్రం రైతుల కోసం ఏమి చేయడం లేదు.. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అన్నీ చేస్తోందని తెలిపారు. మోడీ కొండంత రాగం తీసి ఎదో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు బంధు పథకాన్నే తీసుకుంటే లబ్ది దారుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. పది సీజన్లలో 57 వేల కోట్ల రూపాయలకు పైగా ఇప్పటి వరకు రైతు బంధు కింద అందించామ‌ని తెలిపారు. 130 లక్షల ఎకరాలకు ఆనాడు సాయం అందితే ఇపుడు 150 లక్షల ఎకరాలకు అందుతోంది. మొదట్లో ఒక సీజన్ కు 5 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తే ఇపుడు 7 వేల కోట్ల కు పైగా ఇస్తున్నాం. కేంద్రం మీటర్లు పెడితే.. తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తోందని వివ‌రించారు. ధాన్యం సేకరణ లో అన్ని రికార్డులు అధిగమించాం.. కనీస మద్దతు ధర కంటే ఎక్కువే రైతులకు దక్కుతోందని అన్నారు.

తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. రైతుల సమస్యలపై కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి మాకు లేదు. కాంగ్రెస్ గురించి మాట్లాడటం సమయం వృధా అని అన్నారు. బీజేపీ పై పోరాడమంటే రాహుల్ గాంధీ లైన్ గీసుకుని పాదయాత్ర చేస్తున్నారని విమ‌ర్శించారు. గతం లో రెండు లక్షల రుణ మాఫీ అని రాహుల్ చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మ లేదు ఇప్పుడు కూడా నమ్మరని అన్నారు. సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తూ ఇతర పార్టీ నేతలను లోబర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ చేయిస్తున్న దాడులకు అదరం బెదరం అని అన్నారు. బీజేపీ రంకు బొంకు రాజకీయాలు తెలంగాణ లో చెల్లవు. నాలుగు వేల మంది రాజకీయ నేతలపై సీబీఐ, ఈడీ దాడులు చేస్తే 3800 మంది బీజేపీ లో చేరారని.. పోరాటాల గడ్డ తెలంగాణ లో బీజేపీ ఆటలు సాగవు అని అన్నారు.


Next Story