రైతుబంధు, పింఛన్ తీసుకోట్లే: రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్ర‌హం

MLC Padi Kaushik Reddy is angry with the farmer. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి ఓ రైతుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

By Medi Samrat  Published on  4 Jun 2023 8:55 AM IST
రైతుబంధు, పింఛన్ తీసుకోట్లే: రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్ర‌హం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి ఓ రైతుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఆబాది జమ్మికుంటలో రైతు దినోత్సవంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డిని నష్టపోయిన పంటలకు పరిహారం ఎప్పుడిస్తారని ఓ రైతు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి కోపం వచ్చేసింది. బుర్ర కుమార్ అనే రైతు ఆయనను పంట పరిహారం గురించి ప్రశ్నించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పదివేల పరిహారం ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని.. ఆ హామీ ఎటు పోయిందని నిలదీశారు. పది రోజుల్లో పరిహారం అందజేస్తామన్నారని, మూడు నెలలు గడుస్తున్నా పరిహారం అందలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్సీ కౌశిక్.. నీకున్న భూమి ఎంత అని రైతును ప్రశ్నించగా.. ఆ రైతు తనకు మూడు ఎకరాల భూమి ఉందని సమాధానమిచ్చారు. ఆ భూమికి రైతుబంధు తీసుకోవడంలేదా?, నీకు పింఛన్ రావడంలేదా? అని రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చో అంటూ హెచ్చరించారు. రైతులు మాట్లాడుతూ ఉండగా.. జై కేసీఆర్ అంటూ సమావేశాన్ని ముగించి అక్కడి నుండి వెళ్లిపోయారు కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాడి కౌశిక్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ మరో సారి చిక్కుల్లో పడింది. రైతు దినోత్సవం అని కార్యక్రమం నిర్వహిస్తూ ఓ రైతును ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. మరోసారి పాడి కౌశిక్ రెడ్డి తన దూకుడు స్వభావంతో వార్తల్లో నిలిచాడు.



Next Story