కేసీఆర్ హయాంలోనే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం డెవలప్ అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణలో ఆమె పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామివారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి యాదగిరిగుట్ట క్షేత్ర వైభవం మరింత పెంచాలని కోరారు. కాంగ్రెస్ పాలనతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు శాపంగా మారిన ఫ్లోరైడ్ సమస్యను కేసీఆర్ మిషన్ భగీరథతో పారద్రోలారని అన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించిందన్నారు. మూసీ నది కాలుష్యానికి రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్సే కారణమని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మూసీ ప్రక్షాళన, పుజరుజ్జీవానికి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పేరుతో మూడు ట్రీమ్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, వాటిని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించి జబ్బలు జరుచుకుంటున్నారని కవిత సెటైర్ వేశారు. మూసీ ప్రక్షాళన చేస్తామని నదీ పరీవాహకంలోని పేదల ఇళ్లను ప్రక్షాళన చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కేసీఆర్ రూ.25 వేల కోట్లతో పునరుజ్జీవ ప్యాకేజీ ప్లాన్ చేశారన్న ఆమె, కాళేశ్వరం, కొండపోచమ్మ నుంచి రూ.1700 కోట్లతో మూసీకి లింకేజీ చేయాలని భావిస్తే.. దానిని పక్కనపెట్టిన కాంగ్రెస్, రూ.7,500 కోట్లతో మల్లన్నసాగర్ నుంచి మూసీకి లింక్‌ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఇంత ప్రజాధానం దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళన ప్రోగ్రామ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా మార్చి. ఆ పేరుతో వచ్చే నిధులను ఢిల్లీకి పంపించనుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో నల్గొండ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు కచ్చితంగా బుద్ధి చెబుతున్నామన్నారు. నల్గొండలో కాంగ్రెస్ నాయకులు గుండాల మాదిరిగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై, కార్యాలయాల దాడి చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు.