రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసనలు ఆందోళనలు తెలుపుతున్నా కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
కష్టపడి, నిబద్ధతతో, దేశభక్తితో మహిళా రెజ్లర్లు ప్రపంచానికి భారత దేశ ప్రతిభను చాటారనీ తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రెజ్లర్ల సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోస్కో వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పటికీ నిందితుడు బయట తిరుగుతున్నాడని, బాధితులకు న్యాయాన్ని నిరాకరించరాదని స్పష్టం చేశారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన మహిళ క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రపంచమంతా చూస్తోందని, దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలని సూచించారు.