మహిళలు ఇవే ధరించాలి, ఇలాగే మాట్లాడాలి అని చెప్పే దుష్టుల మాటలు పట్టించుకోకండి

Mlc Kavitha Salute To Woman Journalists. దేశంలోని మహిళలు ఫలానా దుస్తువులు వేసుకోవాలి.. ఫలానా లాగా మాట్లాడాలి, మాట్లాడకూడదని

By Medi Samrat  Published on  24 Jan 2023 1:38 PM GMT
మహిళలు ఇవే ధరించాలి, ఇలాగే మాట్లాడాలి అని చెప్పే దుష్టుల మాటలు పట్టించుకోకండి

దేశంలోని మహిళలు ఫలానా దుస్తువులు వేసుకోవాలి.. ఫలానా లాగా మాట్లాడాలి, మాట్లాడకూడదని దబాయించే అల్లరిమూకలను చూసి భయపడకండని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ లో మీడియా స్పియర్ పేరుతో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి మాస్ కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మహిళా జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగాయన్న ఎమ్మెల్సీ కవిత.. వాటిని తట్టుకుని నిలబడుతున్న ప్రతి జర్నలిస్ట్ మనకు స్ఫూర్తి అని.. వారికి నా సెల్యూట్ అని కొనియాడారు. మహిళా జర్నలిస్టులను టార్గెట్ చేయడం సులభంగా మారిందన్నారు. ఇటీవల భారతదేశంలోని అనేక మందిపై పెగాసస్ ఉపయోగించారని, అందులో ఎక్కువ మంది మహిళా జర్నలిస్టులే ఉన్నారని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వెలిబుచ్చారు.

పాకిస్తాన్ లాంటి దేశాలలో మహిళా జర్నలిస్టులు వార్తలు రాసినందుకు ‌కుటుంబ సభ్యులే పరువు హత్యలు చేసిన ‌సందర్భాలు‌ ఉన్నాయని ఉద‌హ‌రించారు. జర్నలిజం మహిళలకు అనుకున్నంత సులభమైన వృత్తి కాదని.. అయితే చిత్తశుద్ధితో పనిచేస్తే మాత్రం అనేక మంది మ‌హిళ‌ల‌కు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్వార్థంతో కాకుండా, సమాజం కోసం చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేసినప్పుడే సవాళ్లను ఎదుర్కోగలమని అన్నారు. తాను అన్ని పార్టీలలోని మహిళా నాయకురాళ్లతో స్నేహం చేయడాన్ని ఇష్టపడతానని, మహిళా జర్నలిస్టులు కూడా ప్రపంచంలోని వివిధ రకాల సంస్థలతో సంబంధాలు కలిగి ఉండాలని కవిత సూచించారు.

మహిళలంతా స్వతహాగా నిర్ణయాలు ‌తీసుకొని ముందుకెళ్లాలని క‌విత‌ పిలుపునిచ్చారు. దేశంలో మహిళలు ఇవే ధరించాలి, ఇలాగే మాట్లాడాలి అని చెప్పే దుష్టుల మాటలు పట్టించుకోవద్దన్న కవిత.. సరైన నిర్ణయాలు తీసుకొని ఉన్నత స్థానాలను ‌చేరుకోవాలన్నారు. ఈ ఏడాది నుండి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో అర్థికంగా వెనుకబడిన పది మంది విద్యార్థినిలకు భారత్ జాగృతి తరుపున 'కేసీఆర్ స్కాలర్‌షిప్' అందిస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బతుకమ్మ, భారతదేశం, ఓటు హక్కు అంశాలపై మూడు సినిమాలు రూపొందించాలని విద్యార్థినిలను ఎమ్మెల్సీ కవిత కోరారు.

Next Story
Share it