ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on  15 March 2024 6:32 PM IST
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి కోలుకోలేని షాక్‌ తగిలింది. ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు జ‌రిపారు. అనంత‌రం ఆమె వ‌ద్ద నుంచి ఫోన్లను, పలు డ్యాకుమెంట్లను సీజ్‌ చేశారు. క‌విత‌ అరెస్టుపై కుటుంబసభ్యులకు సమాచారమిచ్చిన అధికారులు ఆమెను డిల్లీకి త‌ర‌లిస్తున్నారు. దీంతో ఆమె ఇంటి వద్ద ఉత్కంఠ నెల‌కొంది. క‌వితను అరెస్టు నేప‌థ్యంలో ఆమె నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు, క‌విత అనుచ‌రులు బీజేపీ, నరేంద్రమోదీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

కవిత ఇంటి వద్దకు కొద్దిసేప‌టి క్రితం కేటీఆర్, హరీశ్ రావు చేరుకున్నారు. అరెస్టుపై అధికారుల‌తో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ అధికారుల‌ను అడిగారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

Next Story