గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత.. సామాన్య ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.102 పెంచడం ఎన్నికల తర్వాత అతిపెద్ద ధరల పెంపుగా నిలిచింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత.. ప్రజలు దుకాణాలకు సైతం వెళ్లేందుకు భయపడేలా నిత్యావసరాల ధరలు పెంచుతోందన్నారు. సిలిండర్, పెట్రోల్, డీజిల్ పై సబ్సీడిని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పెంచుతుందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.