ఆ రోజు ఎంతో దూరంలో లేదు..!

MLC Kavitha About Bathukamma Celebrations. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తే.. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ పతాక

By Medi Samrat  Published on  27 Sep 2022 2:33 PM GMT
ఆ రోజు ఎంతో దూరంలో లేదు..!

సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తే.. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నరు అనగానే బతుకమ్మ ఇండియా గేట్ లో వెలుగుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనిమిది ఏండ్లకు బీజేపీకి బుద్దొచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో బతుకమ్మ ఆడటం వెనక కేసీఆర్ హస్తమే ఉందని సగర్వంగా తెలియజేస్తునన్నారు.

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అక్కా చెల్లెల్లు, కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాతే రాష్ట్ర సంస్కృతి, పద్దతి, యాస, భాషకు గౌరవం దక్కిందని, తెలంగాణ తల్లిని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణలో విమోచన దినం నిర్వహించిన బీజేపీ, గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్టాచూ ఆఫ్ యూనిటీ అంటోందన్న ఎమ్మెల్సీ కవిత, విభజన కావాలో, యునిటీ కావాలో యువత ఆలోచించాలన్నారు.

సీఎం కేసీఆర్ త్యాగాల వల్ల, వారికి తోడుగా యావత్ తెలంగాణ ప్రజానీకం నిలబడటం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకుని, సగర్వంగా, గౌరవంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మ జరుగుతున్నదన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ భవన్ ఒక చారిత్రాక ప్రదేశమన్న కవిత, బతుకమ్మ జరుగుతున్నది, బోనాలు వెళుతున్నయంటే, ఇదంతా ప్రారంభమైంది తెలంగాణ భవన్ లోనే అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం యొక్క, రూపురేఖలను, జీవనశైలిని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన భవనం తెలంగాణ భవన్ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.


Next Story