రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాగా మారింది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
By - Medi Samrat |
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయ్యాయని, కానీ ఈ రెండేళ్ల పాలనలో ప్రజా ప్రయోజనాలు మరిచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాలా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
దేశం గర్వించదగ్గ నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని, అలాగే రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన చట్టాలను ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. భూములు ఎక్కువగా ఉన్న వారి నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీనే ఒకప్పుడు తీసుకొచ్చిన చట్టాలను నేడు అదే పార్టీ తూట్లు పొడుస్తోందన్నారు.
పార్టీ పిరాయింపులకు పాల్పడిన నాయకులకు నజరానాలుగా వేల కోట్ల రూపాయల భూములను అక్రమంగా బదలాయిస్తున్నారని ఆరోపించారు. గాజుల రామారం ప్రాంతంలో అరికెపూడి గాంధీ 11 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేశారని, ఆయన పార్టీ మారిన వెంటనే ఆ భూమిని ల్యాండ్ రెగ్యులరైజ్ చేయడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డికి భజన చేస్తే చాలు, పార్టీ మారితే చాలు భూ బదలాయింపులు జరిగిపోతున్నాయన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని సర్వే నెంబర్ 307లో మొత్తం 411 ఎకరాల భూమి ఉండగా, అందులో 317 ఎకరాలను ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. మిగిలిన 123 ఎకరాల 28 గుంటల భూమి మాత్రమే ప్రైవేట్ భూమిగా రికార్డుల్లో ఉందన్నారు. అయితే ల్యాండ్ సీలింగ్ కిందకి వచ్చే భూములపై అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
1980కు ముందే ల్యాండ్ సీలింగ్ కిందకి వచ్చిన భూమిని 1991లో షేక్ ఇమామ్ పేరుపై ఉన్నట్లు రికార్డులు చూపించడం, ఆయన అప్పటికే భూమిని అమ్మేసినా, 2006లో అమ్మినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం ఘోర నేరమన్నారు. ఆ భూమిలో 128.28 ఎకరాలను నలుగురు వ్యక్తులు విక్రయించినట్లు రికార్డులు ఉన్నాయని తెలిపారు. 2015 వరకు ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగినా, ఇప్పుడు అక్రమంగా భూములను తిరిగి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
అరికెపూడి గాంధీ పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా ఏమిటంటే—ఇప్పటికే అమ్మిన భూమిని నకిలీ డాక్యుమెంట్లతో మళ్లీ అతని పేరుపై రిజిస్టర్ చేయించడం అని ఆరోపించారు. భూ భారతి పోర్టల్‌లో కూడా అరికెపూడి గాంధీ పేరుపై ఎంట్రీ చేయడం ప్రభుత్వ ప్రమేయం లేకుండా సాధ్యం కాదన్నారు.
ఈ అక్రమాలపై మాధవరం కృష్ణారావు బాధ్యతగల ప్రజాప్రతినిధిగా సీసీఎల్ఏ, చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విజిలెన్స్ కమిషనర్, కూకట్పల్లి పోలీస్ కమిషనర్ సహా పలు శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. తాను కూడా హైడ్రా కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు ఇవ్వగా, “రేపే చర్యలు తీసుకుంటాం” అని చెప్పినప్పటికీ, మరుసటి రోజే అక్కడ అక్రమ బౌండరీలు వేసినట్లు చెప్పారు.
తరతరాలుగా ప్రభుత్వానికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు. కబ్జాదారులను, దొంగలను అరికట్టకపోతే దేశాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. పార్టీ మారితే వేల కోట్ల భూములు నజరానాగా ఇస్తారన్న ప్రచారం నిజమని ఆరోపించారు.
ఐడీపీఎల్ భూములపై విచారణ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతూనే, అది కేవలం ఒక్క సర్వే నెంబర్‌కే పరిమితం చేయడం డ్రామా తప్ప మరొకటి కాదన్నారు. గాజుల రామారం సర్వే నెంబర్ 307పై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. మాధవరం కృష్ణారావు పలుమార్లు పూర్తి స్థాయి విచారణ కోరినా పట్టించుకోలేదన్నారు.
నియమనిబంధనలు పాటించకుండా హైడ్రా పేరు చెప్పి అక్రమ బ్లూ షీట్లు పెట్టడం జరుగుతోందన్నారు. దమ్ముంటే గాజుల రామారం సర్వే నెంబర్ 307లోని భూముల వద్దకు రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. “అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు” ప్రభుత్వ భూములను పంచడం ఏ నైతికత అని నిలదీశారు.
రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు తెచ్చిన చట్టాలను తానే అధికారంలోకి వచ్చి నాశనం చేశారని విమర్శించారు. ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ఉన్న భూముల్లో జరుగుతున్న అన్ని కార్యకలాపాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అనుమతులు ఇచ్చిన అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని కోరారు. భూ భారతి అంటే బోగస్ భారతి అయ్యిందా? అని ప్రశ్నించారు.
ఐడీపీఎల్ భూములపై ఎలాంటి విచారణ జరుగుతోందో, అదే విధంగా గాజుల రామారం సర్వే నెంబర్ 307పై కూడా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య సమన్వయం లేదని, హిల్‌టాప్ పాలసీ డాక్యుమెంట్లను మంత్రులే బయటకు ఇచ్చారని ఆరోపించారు.
ప్రతి రోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పేర్లు చెప్పడం తప్ప రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలపై మాట్లాడటం లేదన్నారు. ప్రతిపక్ష నేతలపై బురదజల్లితే ప్రజలు నమ్మరని హెచ్చరించారు. ఏకగ్రీవ ఎన్నికల పేరుతో బెదిరింపులకు పాల్పడిన విషయం ప్రజలు చూశారన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కేవలం 50 శాతం స్థానాలు మాత్రమే గెలవడం సిగ్గుచేటని, ప్రభుత్వం నిజంగా మంచి చేస్తే 90 శాతం స్థానాలు గెలవాల్సిందన్నారు.
మహాలక్ష్మి, రైతు బంధు వంటి హామీలు గ్రామాల్లో అమలు కాలేదని, కానీ తాత–మనవడు ఆడుకోవడానికి ప్రభుత్వ ఖజానా నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. ఈ ఖర్చు ఎవరి కోసమని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కోర్టులో కేసులు నడుస్తుండగానే జీవో నెంబర్ 9 ఎవరి అనుమతితో ఇచ్చారని, ఎందుకు ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించారని ప్రశ్నించారు. దమ్ముంటే పార్టీ పిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
దమ్ముంటే వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. స్పీకర్‌ను తప్పుదోవ పట్టించవద్దని, ఆయనకు మంచి అవకాశం ఉండేదన్నారు. అధికారంలోకి రావడం కోసం బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి అబద్ధాల రాజకీయాలు చేస్తున్నారని, మోదీని “బడే బాయ్” అన్న నాయకుడు దేశంలో మరొకరు లేరన్నారు. రాహుల్ గాంధీ “చౌకీదార్” అంటారని, రేవంత్ మాత్రం “బడే బాయ్” అంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆరోపించారు.
బీజేపీ మీడియా సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డిపై 10 శాతం విమర్శలు చేయడం లేదని, ఒకవేళ చేస్తే తాను ముక్కు నేలకు రాసిపోతానని అన్నారు. బీజేపీ–బీఆర్‌ఎస్ ఒక్కటే అయితే కేసీఆర్‌పై కమిషన్లు ఎందుకు, కవితను జైలుకు ఎందుకు పంపారని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఇటు రాహుల్ గాంధీని, అటు నరేంద్ర మోదీని చూస్తూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు ఎన్నిసార్లు మోదీపై మాట్లాడారని ప్రశ్నించారు. కేటీఆర్ అమృత్ స్కామ్‌పై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ ఒకటేనని ఆరోపించారు.