శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు బండ ప్రకాష్ ముదిరాజ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రకాష్ వెంట మంత్రులు కెటి రామారావు, టి హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ మహమూద్ అలీ, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ పదవికి బండ ప్రకాష్ పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఇదిలావుంటే.. మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసయనున్నారు. అనంతరం బాధ్యతలు అప్పగిస్తారు.