బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు బాధితుడేనని.. ఆయన ఎంత కష్టపడినా కేటీఆర్ తర్వాతేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మా కోమటిరెడ్డి ఇంటికి వచ్చినరోజు హరీష్ సంతోషంగా ఉన్నాడు.. మా వాళ్ళని కలిస్తే హరీష్ రావుకి స్వేచ్ఛగా ఉందన్నారు. మామ కోసం హరీష్ యాక్షన్ మొదలు పెడతాడన్నారు. రోజూ ప్రెస్ మీట్ పెట్టే హరీష్.. కవిత ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు.. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నోరు లేవడం లేదా.? అని ప్రశ్నించారు.
శారదా పీఠానికి అధిపతిగా హరీష్ రావును చేయాలేమో.. శారదా పీఠాధిపతికి లేని బాధ, ఆక్రందన హరీష్ రావుకి ఎందుకు.? అని ప్రశ్నించారు. శారదా పీఠానికి ఏపీలో ఇచ్చిన భూములను రద్దు చేశారన్నారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ హయాంలో రూపాయికి ఎకరం చొప్పున శారదా పీఠానికి 2 ఎకరాల భూమి ఇచ్చారు.. భూమిని రద్దు చేయడాన్ని శారద పీఠం ఒప్పుకుందన్నారు. ఇంకెంత దోచుకుంటే హరీష్ రావు ధనదాహం తీరుతుందోనని మండిపడ్డారు.
నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష నేతలు మాట్లాడడం సరైంది కాదన్నారు. పేదలను ఇబ్బంది పెట్టడం మా విధానం కాదన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. కక్ష సాధింపులకు మేం వ్యతిరేకం.. కక్ష సాధింపులు చేయాలంటే అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసేవాళ్ళం అన్నారు.