'నువ్వా - నేనా'.. తెలంగాణ పవర్ చూపిస్తానంటున్న కౌశిక్.. దమ్ముంటే బయటకురా అన్న గాంధీ
తన ఇంటిపై అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్ లోకల్ అంశాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెరపైకి తెచ్చారు.
By అంజి Published on 12 Sept 2024 2:27 PM IST'నువ్వా - నేనా'.. తెలంగాణ పవర్ చూపిస్తానంటున్న కౌశిక్.. దమ్ముంటే బయటకురా అన్న గాంధీ
హైదరాబాద్: తన ఇంటిపై అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్ లోకల్ అంశాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెరపైకి తెచ్చారు. ''మీకు దమ్ము లేదు. ఇంత మంది వచ్చి కూడా నా వెంట్రుక పీకలేదు. తెలంగాణ బిడ్డలం. బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు దాడి చేస్తే భయపడేటోలు ఎవడూ లేడు. రేపు తెలంగాణ పవర్ ఎంటో చూపిస్తాం'' అని పాడి హెచ్చరించారు.
ఈ క్రమంలోనే తనను బతకడానికి వచ్చావా అన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనను బతకడానికి వచ్చావా? అని ఎలా అంటావు? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి.. నువ్వు కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చా? బతకడానికి కాదా? 29 రాష్ట్రాల ప్రజలు ఉంటున్న ఈ ప్రాంతంలో జనం మధ్య విబేధాలు సృష్టించాలని చూస్తావా? అని గాంధీ ప్రశ్నించారు.
కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో కొండాపూర్‌లోని ఆయన ఇంటికి అనుచరులతో కలిసి గాంధీ వెళ్లారు. కౌశిక్ ఇంటి ముందు అనుచరులతో కలిసి గాంధీ బైఠాయించారు. ''నా ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తా అన్నావు. నువ్వు రాలేదు. నేనే నీ ఇంటికి వచ్చా. పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు ఇంట్లో దాక్కున్నావు. తేల్చుకుందాం. బయటకు రా. నువ్వు వచ్చే వరకూ ఇక్కడే ఉంటా?'' అని గాంధీ తేల్చి చెప్పారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ క్రమంలోనే అరెకపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అటు అరికెపూడి గాంధీని విడిచిపెట్టేది లేదని, చర్యకు ప్రతిచర్య తప్పదని కౌశిక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై హత్యాయత్నం చేశారని అన్నారు. గూండాలు వచ్చి ఇలా దాడి చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
కొండాపూర్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి అరికెపూడి గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి చొచ్చుకెళ్లారు. కౌశిక్ రెడ్డ ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఈ ఘటనలో కౌశిక్ ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పందించారు. సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందన్నారు. రేవంత్ వెంటనే కౌశిక్‌కు క్షమాపణ చెప్పి, పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.