అనేక రకాలుగా నన్ను ఇబ్బందులకు గురిచేశారు: ఎమ్మెల్యే సీతక్క

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడింది.

By Srikanth Gundamalla  Published on  2 Dec 2023 11:10 AM GMT
MLA Seethakka,  mulugu, telangana, congress,

అనేక రకాలుగా నన్ను ఇబ్బందులకు గురిచేశారు: ఎమ్మెల్యే సీతక్క 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడింది. ఇంకొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. అయితే.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఆసక్తికరంగా మారాయి. దాంతో.. దాదాపుగా కాంగ్రెస్‌కే ఎక్కువ స్థానాలు వస్తాయని వెల్లడించాయి. కానీ.. బీఆర్ఎస్ నాయకులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. తమకే ఎక్కువ సీట్లు వస్తాయని.. మూడోసారి అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. తెలంగాణలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో వెలుగు నిండుతాయని అన్నారు. అయితే.. తనపై బీఆర్ఎస్‌ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలు చేసి ఎంతో ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. ఆడబిడ్డగా ములుగు ప్రజలు తనని ఆదరించాయని అన్నారు. ములుగులో చిన్న పిల్లలు కూడా తనకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారని ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. తన జీవితానికి ఇది చాలని అన్నారు. అయితే.. తన గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు సీతక్క.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుందని.. ఆ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి తోడ్పడతానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రజలకు కష్టకాలంలో తాను మాత్రమే వెంటే ఉన్నానని గుర్తు చేశారు. అయితే.. తనపై కుట్రలు చేసి ఇబ్బందులు పెట్టినవారికి ఆడబిడ్డ ఉసురు తగులుతుందని అన్నారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆవేదన చెందారు. తనకు ఎంతటి కష్టం ఉన్నా ప్రజల వెంటే ఉంటానన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే కృషి చేస్తానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

Next Story