బీజేపీ హైకమాండ్‌కు రాజాసింగ్‌ సతీమణి లేఖ.. అందుకేనా.!

MLA Rajasingh's wife wrote the letter to the BJP high command. షోకాజ్ నోటీసుపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం ఇవ్వాలని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి టీ

By అంజి  Published on  2 Sep 2022 5:59 AM GMT
బీజేపీ హైకమాండ్‌కు రాజాసింగ్‌ సతీమణి లేఖ.. అందుకేనా.!

షోకాజ్ నోటీసుపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం ఇవ్వాలని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి టీ ఉషాబాయి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హైకమాండ్‌ను అభ్యర్థించారు. రాజాసింగ్‌ జైలులో ఉన్నారని తెలిపారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. నేటితో సస్పెండ్‌ ముగుస్తుండటంతో బీజేపీ హైకమాండ్‌కు ఉషాబాయి లేఖ రాశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యల పోస్ట్ వైరల్ కావడంతో హైదరాబాద్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించగా పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. తన వివాదాస్పద ప్రకటనలతో నిరసనలను ప్రేరేపించినందుకు అతనిపై పోలీసులు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. 2004 నుండి ఎమ్మెల్యే రాజా సింగ్‌పై 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేపై పీఏ చట్టం నమోదు కావడం ఇదే తొలిసారి.

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా అని ఆరోపించారు. రాజాసింగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఆందోళనలు, నిరసనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజాసింగ్ పై అనేక చోట్ల కేసులు నమోదు అయ్యాయి.

Next Story
Share it