నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్ర.. పాత కేసులు ఇప్పుడు గుర్తొచ్చాయా? : రాజాసింగ్
MLA Rajasingh reacted to Hyderabad police giving notices. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లు పాత కేసులకు సంబంధించి
By అంజి Published on 25 Aug 2022 9:31 AM GMTహైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లు పాత కేసులకు సంబంధించి బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌కు ఆగస్టు 25న 41(ఎ) సిఆర్‌పిసి నోటీసులు జారీ చేశాయి. ఎమ్మెల్యేను మళ్లీ అరెస్ట్ చేసేందుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.. అంతేకాకుండా.. ఇటీవల ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్టు చేయడంలో మంగళ్‌హాట్ పోలీసుల రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించిన 14వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలను సవాలు చేసే ప్రక్రియలో హైదరాబాద్ పోలీసులు ఉన్నారని సీనియర్ పోలీసు ఒకరు న్యూస్‌మీటర్‌కి తెలిపారు.
షాహినాయత్‌గంజ్ పోలీసులు జారీ చేసిన మొదటి నోటీసులో.. ''ఏప్రిల్ 4, 2022న, ఏప్రిల్ 10న హైదరాబాద్‌లోని బేగంబజార్ ఛత్రిలో రెచ్చగొట్టే పాటను ప్లే చేసినందుకు మీపై షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ జి.రాజేశ్వర రెడ్డి నుండి మాకు ఫిర్యాదు అందింది. శ్రీరామనవమి ఊరేగింపు-2022 సమయంలో సుమారు రాత్రి 8:00 గంటలకు". ఎమ్మెల్యేపై సెక్షన్ 153 (ఎ), 295 (ఎ), 504, 505 (2) ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేశారు.'' అని ఉంది. అలాగే ఈ ఏడాది ఫిభ్రవరి 19న మంగళ్‌హాట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని... కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మంగళ్‌హాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆగస్టు 23వ తేదీన హైదరాబాద్‌లోని ఓ వర్గం ప్రజలు భారీ ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అయితే మహ్మద్ ప్రవక్తపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ చేసిన అవమానకర వ్యాఖ్యలపై నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో రాజాసింగ్ విడుదల అయ్యారు. తాజాగా మరోసారి పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ రెండు కేసులలోనూ పోలీసులు ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో రాజాసింగ్‌కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేయడంతో.. మరోసారి నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఆర్నెళ్ల క్రితం కేసులు నమోదైతే.. పోలీసులు ఇన్ని రోజులు ఏం చేశారని రాజాసింగ్ ప్రశ్నించారు. పాత కేసులకు సంబంధించి 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని, ఏప్రిల్ ఘటనకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని రాజా సింగ్ నిలదీశారు.