అది వంద శాతం ఫేక్ న్యూస్ : జీవితాంతం టీఆర్‌ఎస్ లోనే ఉంటా..
Mla Rajaiah About Fake News. తన జీవితాంతం టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
By Medi Samrat Published on 9 Aug 2021 4:41 PM ISTతన జీవితాంతం టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తేల్చిచెప్పారు. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. లోటస్ పాండ్‌లో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ను కలిసినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. అది వంద శాతం ఫేక్ న్యూస్ అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడారు. 2019 సంవత్సరంలో ఒక కైస్త్రవ సమావేశానికి ముందు అనిల్ కుమార్‌ను కలిసినప్పుడు దిగిన ఫోటో అది అని రాజయ్య స్పష్టం చేశారు.
వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం మొదలు పెట్టిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇది సత్యదూరమైన వార్త.. తీవ్రంగా ఖండిస్తున్నానని రాజయ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగానని, అందుకే టిఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ తనకు ఇచ్చారు అని రాజయ్య తెలిపారు. తనకు ఇష్టమైన వైద్యారోగ్య శాఖను అప్పజెప్పారు. అడగక ముందే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తాను టీఆర్‌ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాను అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు అంటగట్టడం సరికాదన్నారు. ఇవాళ కేసీఆర్ దళితుల పక్షపాతిగా కొనసాగుతున్నారు. దళితులు తలెత్తుకుని తిరిగే విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు అని తాటికొండ రాజయ్య ప్రశంసించారు. ఇవన్నీ ముందుకు తీసుకుని వెళుతున్న క్రమంలో తనపై బురదజల్లాలని చూడడం తగదన్నారు. పాత ఫొటోలతో పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు.
వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. అసత్య ప్రచారాలు చేసి మనసు గాయపర్చవద్దని విన్నవించారు. నా జీవితాంతం టీఆర్‌ఎస్‌లోనే ఉంటా. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా కేసీఆర్ నాకు భిక్ష పెట్టారు. మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేకపోయారు కాబట్టే కేసీఆర్ దళిత ఎంపవర్‌మెంట్ తెచ్చారని రాజయ్య చెప్పారు.