టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారంపై సిట్ తో దర్యాప్తు చేయించాలని బీజేపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నేరుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంలో భాగంగా నిందితులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిల మధ్య జరిగిన సంభాషణ అంటూ శుక్రవారం ఈ ఆడియో వ్యవహారంపై విచారణ చేపట్టాలని రఘునందన్ రావు ఈడీ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన ఈడీ కార్యాలయంలో ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ వినతిని స్వీకరించిన ఈడీ అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు రఘునందన్ రావు తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేను కొనేందుకు సుమారు రూ. 400 కోట్ల డీల్ జరిగిందని వార్తలు వస్తుండగా.. ఇదంత ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన అంశం కావడంతో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఈడీ అధికారులకు రఘునందన్ రావు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. పోలీసులు రూ. 15 కోట్ల మేర నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయని.. దానిపై కూడా విచారణ జరపాలని కోరారు.