వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గత 13 రోజులుగా శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం చేస్తున్నారు. గురువారం మహాపూర్ణాహుతితో అతిరుద్ర మహా యాగం పూర్తి కానుంది. అయితే.. యాగంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనకు భద్రతగా కేటాయించిన సిబ్బందితో రీల్స్ చేశారంటూ కథనాలు వెలువడుతుండటం వివాదస్పదమవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. ప్రభుత్వ, పోలీసు సెక్యూరిటీతో రోహిత్ రెడ్డి రీల్స్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ విషయమై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. వారు నా భద్రతా సిబ్బంది.. తాను నడుస్తున్నప్పుడు అన్ని వైపుల నుంచి వీడియోలు తీస్తుంటారు. ఆ వీడియోలను ఎఫెక్ట్స్ పెట్టి క్రియేట్ చేసుంటారు. ఇది అసలు టాఫికే కాదంటూ ఖండించారు. మాములు వీడియోకు స్నాప్ చాట్ ఎఫెక్ట్‌ను వాడింది మా యువజన విభాగం నాయకుడే అని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. నరేంద్ర మోదీ లా తామేమి వీడియో షూట్ చేయలేదన్నారు. నేచురల్‌గా వచ్చిన దానికి తప్పేమి లేదని అన్నారు. ప్రజల కోసం పనిచేయకుండ.. పనీపాట లేని వాళ్లే ఇలాంటి వాటికి రాజకీయ కోణం ఆపాదిస్తారని.. వాటిని తాను పట్టించుకోనని అన్నారు. ఇదిలావుంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనంతరం రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది.
ఇదిలావుంటే.. గురువారం ఉదయం శ్రీ కామాక్షీ పీఠం(శ్రీకాకుళం)కు చెందిన వేద పండితులు ప్రధాన యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.