గ్రూప్-1 పరీక్షల్లో అవకతవలకు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగిందని, ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టిక్కెట్లు ఎందుకు జారీ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్షకు హాజరుకాగా, 74 మంది ఎంపికయ్యారని, అదేవిధంగా 25 సెంటర్లలో 10 వేల మంది పరీక్ష రాస్తే కేవలం 69 మంది మాత్రమే ఎంపికయ్యారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
654 మందికి ఒకే విధమైన మార్కులు ఎలా వచ్చాయని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఒక కాంగ్రెస్ నాయకుడి కోడలికి ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంకు వచ్చిందని, ఆమె కోఠి కళాశాలలోనే పరీక్ష రాశారన్నారు. ఉర్దూలో పరీక్ష రాసిన 9 మందిలో ఏడుగురు ఎంపికయ్యారని, టాప్ 100లో ఉర్దూ మీడియం అభ్యర్థులు ముగ్గురు ఉన్నారన్నారు. 8 వేల మంది తెలుగులో పరీక్ష రాస్తే కేవలం 60 మంది మాత్రమే ఎంపికయ్యారని, టాప్ 100లో నలుగురు మాత్రమే ఉన్నారన్నారు.