చేసింది.. చెప్పుకోలేకే ఓడిపోయాం: కేటీఆర్‌

తమ ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.

By అంజి  Published on  22 May 2024 4:00 PM IST
KTR, assembly elections, Telangana, Narsampet, MLC

చేసింది.. చెప్పుకోలేకే ఓడిపోయాం: కేటీఆర్‌

తమ ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్‌ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి కూడా యువతకు దూరమయ్యామని అన్నారు. చేసింది చెప్పుకోలేక ఓడిపోయామ‌న్నారు. చదువుకున్న విద్యావంతులు కాంగ్రెస్‌ పాలన గురించి ఆలోచించాలని కోరుతున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఎన్నిక ప్ర‌చార స‌భ‌లో పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మ‌ద్ద‌తు ఇవ్వాలని పట్టభద్రులను కోరారు. ''ఈ ఎన్నిక‌ల‌తో ఫ‌లితంలో ప్ర‌భుత్వం కూలిపోయేది లేదు. తారుమార అయ్యేది లేదు. ఆరు నెల‌ల కిందట అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. కేసీఆర్‌తో పాటు అంద‌రం ప్ర‌తి నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాం. ద‌య‌చేసి మోస‌పోకండి.. గోస‌ప‌డుతామ‌ని చెప్పాము. కానీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ వాగ్దానాలు న‌మ్మి కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు'' అని కేటీఆర్ అన్నారు.

చదువుకున్న యువత.. ఎన్నిక‌ల‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంద‌మైన నినాదాలు ఎక్క‌డున్నాయో ఆలోచించాలని కేటీఆర్ అన్నారు. తనకు ఓటు వేస్తే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ ఫైల్‌పై డిసెంబ‌ర్ 9న మొదటి సంత‌కం చేస్తాన‌ని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, తొందరగా బ్యాంక్‌కు వెళ్లి 2 ల‌క్ష‌ల రుణం తెచ్చుకోవాల‌ని కూడా సూచించారని కేటీఆర్‌ అన్నారు. ఇప్పుడు డిసెంబ‌ర్ 9 పోయి.. మ‌రో ప‌ది రోజులు అయితే జూన్ 9 వస్త‌దని, ఆరు నెల‌లు గ‌డిచిపోతదని అన్నారు. మొదటి రోజే సంత‌కం చేస్తాన‌ని మోసం చేసిన రేవంత్ రెడ్డి నిల‌బెట్టిన అభ్య‌ర్థి ప‌ట్ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో ఆలోచించాల‌ని పట్టభద్రులను కేటీఆర్ కోరారు.

Next Story