అడగడం మొదలుపెట్టిన హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ మొదలైంది. ఇన్నాళ్లూ అధికారపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షం అయింది.
By Medi Samrat Published on 9 Dec 2023 5:30 PM ISTతెలంగాణ అసెంబ్లీ మొదలైంది. ఇన్నాళ్లూ అధికారపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షం అయింది. ఈ సమయంలో ఎలాంటి డిబేట్స్ జరగబోతున్నాయా అనే కొంత క్యూరియాసిటీ జనంలో ఉంది. తాజాగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత కావాలని అన్నారు. విమర్శలు చేయడానికి తాము రాలేదని.. వ్యవసాయ పెట్టుబడిపైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఓ వైపు వర్షాలు పడుతున్నాయని.. బోనస్ ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని.. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నవంబర్ చివరి వారం డిసెంబర్ మొదటి వారంలో వేశామని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు పెంచుతాం అన్నారని హరీష్ రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రైతు బంధు కింద 15 వేల రూపాయలు ఇస్తామని, డిసెంబర్ 9 న ఇస్తాం అని మాట ఇచ్చారని గుర్తు చేశారు. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారని రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నామన్నారు హరీష్ రావు.