సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నిక అనంతరం తిరిగి పయనమవుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పిన డైలాగ్ అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ ఎన్నిక పూర్తయ్యాక మీడియాతో మాట్లాడకుండా ఎమ్మెల్యే కారు ఎక్కుతూ.. “బుల్లెట్ దిగిందా.? లేదా..?” అంటూ చెప్పిన డైలాగ్ పరోక్షంగా అధికార పార్టీని ఉద్దేశించి చేప్పిందేనని అక్కడి రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన చెప్పిన డైలాగ్ అక్కడున్న నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేపింది.
ఇదిలావుంటే.. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్‌ను వీడి తప్పు చేశానంటూ అనుచరవర్గం వద్ద వాపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారు. దీంతో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ దూకుడు కొనసాగింది. ఇప్పటికే గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్.. తాజాగా ఇస్నాపూర్ మున్సిపాలిటీని కూడా తమ ఖాతాలో వేసుకుంది. జిన్నారం మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ల మద్దతు, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఎక్స్ అఫిషియో ఓటు కీలకంగా మారి బీఆర్‌ఎస్‌కు అధికారం దక్కింది. దీంతో పటాన్‌చెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసి బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్‌గా మారింది