వరి దిగుబడిలో తెలంగాణా రికార్డ్ సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తే 153 లక్షల ధాన్యం దిగుబడి కావడం తెలంగాణా రైతాంగం సాధించిన ఘన విజయమని ఆయన అభివర్ణించారు. ఏ.ఐ.సి.సి మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు
ఇక్కడ ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం దిగుబడిని తెలుసుకున్న ఆయన మహారాష్ట్ర నుండి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దాన్యం దిగుబడి ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు చెందిన మూడు బ్యారేజ్ లు పనిచేయక పోయినా వరి దిగుబడిలో సాధించిన ఈ రికార్డ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు.
రైతాంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందనడానికి రికార్డ్ స్థాయిలో పండిన పంట నిదర్శనమన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా యావత్ భారతదేశంలొనే ఇంతటి ధాన్యం దిగుబడి అరుదైన రికార్డ్ గా ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణా ప్రాంతంలో ఇంతటి పంట పండిన సందర్భం లేదన్నారు.
ప్రభుత్వంతో మమైకమైన రైతాంగం అంకిత భావంతో చేసిన సాగుతోటే ఈ విజయం సాధ్యపడిందని అందుకు తెలంగాణా రైతాంగానికి అభినందనలు తెలియ పరుస్తున్నామన్నారుఅందుకు చేయూత నందించిన నీటిపారుదల మరియు వ్యవసాయ శాఖా సిబ్బంది పాత్ర శ్లాఘనీయమని ఆయన కొనియాడారు.