కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ : మంత్రి ఉత్తమ్
ఈ ఏడాది కొత్త ఆయకట్టు కు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
By Medi Samrat Published on 13 Jan 2024 9:45 AM GMTఈ ఏడాది కొత్త ఆయకట్టు కు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏడాది చివర నాటికి కొత్తగా 4.5 నుంచి ఐదు లక్షల ఎకరాలకు నీరందించే విదంగా ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారు. అందుకు తగిన ఫలితం రాలేదన్నారు. ఇపుడు అవసరమైన నిధులు వ్యయం చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
కొత్తగా ప్రాజెక్టులలో నీరందించే విషయంలో అడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరందించాలని మంత్రి సూచించారు. రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులపై పనులు వేగవంతం చేయాలని సూచించారు. కృష్ణ, గోదావరి బేసిన్ లలో సుమారు 18 ప్రాజెక్టులలో పలు ప్యాకేజల కింద ఈ ఏడాది చివర నాటికి నీరందిస్తామన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏ ప్రాజెక్టులలో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామో సమాచారం సిద్ధం చేయాలని.. కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయంలో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
కొత్త ఆయకట్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మంథని నియోజక వర్గానికి నీరందించే పనులు చేపట్టాలని సూచించారు. రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలం లోపు అన్ని చెరువుల పనులు పూర్తవ్వాలని ఆదేశించారు.
ఐడిసి పరిడిలో ఉన్న అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పని చేసే విదంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని తెలిపారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ పైన విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జికి లేఖ రాయడం జరిగింది.. సిట్టింగ్ జడ్జి విచారణ కోరుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కోయిన ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీ నీరు మనకు ఇవ్వాలని కోరుతున్నామని.. మహారాష్ట్రకు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వ్యయం అందిస్తామని సూచించామని మంత్రి పేర్కొన్నారు.