ధాన్యం దిగుబడిలో తెలంగాణా రికార్డ్

ధాన్యం దిగుబడిలో తెలంగాణా రాష్ట్రం యావత్ భారతదేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

By -  Medi Samrat
Published on : 7 Oct 2025 9:20 PM IST

ధాన్యం దిగుబడిలో తెలంగాణా రికార్డ్

ధాన్యం దిగుబడిలో తెలంగాణా రాష్ట్రం యావత్ భారతదేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

వానాకాలం సీజన్ లో 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుందని ఆయన తెలిపారు.దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంతటి దిగుబడి ఏక్కడ నమోదు కాలేదని ఆయన అన్నారు.

వానాకాలం ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల కేంద్ర కార్యాలయం ఆయన సమీక్ష నిర్వహించారు.

పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ తదితర అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల విస్తరణతో తెలంగాణా రాష్ట్రం సాధించిన వృద్ధి ధాన్యం దిగుబడిలో ప్రస్ఫుటమౌతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 67.57 లక్షల ఎకరాలలో జరిగిన వరి సాగులో 40.75 లక్షల ఎకరాలలో సన్నాలు,26.82 లక్షల ఎకరాలలో దొడ్డు వడ్ల సాగు చేశారన్నారు.

ఇందులో సన్నాలు 90.46 లక్షల మెట్రిక్ టన్నులు,దొడ్డు రకం 57.84 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం కలిపి 148.30 లక్షల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు.

తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి అరుదైన రికార్డుగా ఆయన అభివర్ణించారు.భారతదేశ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు గా నమోదు అవుతుందన్నారు.

ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అరుదైన రికార్డు నెలకొల్పిన ఘనత తెలంగాణా రైతాంగానికి చెందుతుందన్నారు. అదే సమయంలో కొనుగోళ్లలోను రాష్ట్రం యావత్ భారతదేశానికి మార్గదర్శనంగా నిలుస్తోందన్నారు.

80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు.కనిష్ట మద్దతు ధర కింద కొనుగోలు మొత్తానికి 21,112 కోట్ల రూపాయలు అబుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇందులో నేరుగా రైతులకు చెల్లింపుల కింద 19,112 కోట్లు ఖర్చు కానున్నట్లు ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ నిమిత్తం చెల్లించాల్సిన 6,500 కోట్లు తక్షణమే విడుదల ఆయన డిమాండ్ చేశారు.రైతులకు మద్దతు ధర చెల్లించడంలో జాప్యం కాకుండా ఉండేందుకు దోహదపడుతుందన్నారు.

ప్రభుత్వంపై నమ్మకంతో రైతాంగం రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేసిన నేపద్యంలో కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులలో ఆలస్యం కాకుండా చూడాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.

అదే విదంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా సన్నాలు పండించిన రైతులకు అందించే 500 రూపాయల బోనస్ ను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే వానాకాలం, యసంగి పంటలకు రైతులకు బోనస్ చెల్లింపులకు గాను 3,159 కోట్లు అవసరం ఉందన్నారు.

తెలంగాణా రాష్ట్రంలో పండిస్తున్న సన్నాలకు అంతర్జాతీయ స్థాయిలో అధిక డిమాండ్ పలుకుతుందన్నారు.ఇప్పటికే ఫిలిప్పిన్ దేశంతో అనేక దేశాలకు ఉత్పత్తి అవుతుందన్నారు.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిన నేపద్యంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు గాను గిడ్డంగుల కొరత ఉండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత ఆహార సంస్థ అద్వర్యంలోని గిడ్డంగులు 22.61 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉండగా ఇప్పటికే 21.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువలతో అవి నిండి పోయాయన్నారు.కేవలం 0.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉంచేందుకు మాత్రమే ఖాళీగా ఉందన్నారు.

అయితే ప్రస్తుతం 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను వినియోగించే రాష్ట్రాలకు రవాణా చేయక పోవడంతో ఎఫ్. సి.ఐ గిడ్డంగులలో అవి పేరుకపోయాయన్నారు.దీనితో వానాకాలం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు స్థలం కొరవడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బాయిల్డ్ రైస్ ను వినియోగించే రాష్ట్రాలకు సత్వరమే తరలించాలని ఆయన కోరారు.ఈ మెరకు కేంద్ర ఆహార ,వినియోగదారుల శాఖామంత్రి ,ఎఫ్. సి.ఐ సి.యం.డి లకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.స్థాక్ తరలింపుకు ఆదనపు రైళ్లను కేటాయించాలని,కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని సహకరించని పక్షంలో ధాన్యం కొనుగోలులో ఉత్పన్నమయ్యే పరిస్థితులకు కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

ధాన్యం దిగుబడిలో తెలంగాణ సాధించిన రికార్డును కేంద్రం గుర్తించి సహకరించాలని ఆయన కోరారు.

తెలంగాణా రాష్ట్రం వరి దిగుబడిలో సాధించిన రికార్డ్ ను ఆయన గణాంకాలతో సహా వివరించారు.

2019-20 లో 72 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2025-26 నాటికి ఏకంగా 148.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి చేరింది అంటే నీటిపారుదల శాఖా సాధించిన విజయానికి సంకేతం అని ఆయన చెప్పారు. బలమైన సంకల్పంతో పాటు ఆధునిక పద్దతిలో కొనుగోళ్లు జరపడం తెలంగాణా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భరోశయో కారణామన్నారు.

అత్యల్ప కాలంలో వరి దిగుబడి రెట్టింపు కావడం రాష్ట్ర వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయమన్నారు.

కొనుగోళ్ల అంశంలో అధికారులు ఎఫ్. సి.ఐ తో సమన్వయం చేసుకుని ప్రణాళికలు రూపొందించు కోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Next Story