యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా : మంత్రి ఉత్తమ్
భారత్-పాకిస్థాన్ ల మధ్య ఏర్పడిన యుద్ద వాతావరణంలో తన అవసరమని భావిస్తే యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat
భారత్-పాకిస్థాన్ ల మధ్య ఏర్పడిన యుద్ద వాతావరణంలో తన అవసరమని భావిస్తే యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
భారత వైమానిక దళంలో పని చేసిన తాను మిగ్-23 వంటి యుద్ద విమానాలు నడిపిన ఫైటర్ పైలెట్ గా పనిచేసిన అనుభవం తనకుందని ఆయన తెలిపారు.
అదే అనుభవంతో తాజాగా రెండు దేశాల మధ్యన ఏర్పడ్డ ఉద్రిక్తత వాతావరణంలో తన సేవలు అవసరమనుకుంటే వెనక్కి తగ్గేది లేదని ఆయన సుస్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం గాంధీభవన్ లో విలేకరులతో జరిగిన చిట్ చాట్ లో ఆయన పాల్గొన్నారు.
తాను 16 ఏళ్ల వయసులోనే సాయుధ దళాల్లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.1982 నాటికే మిగ్-21వంటి యుద్ద విమానాలు నడపడంతో పాటు తరువాత క్రమంలో మిగ్-23 యుద్ద విమానాలను సమర్ధ వంతంగా నడిపినట్లు ఆయన తెలిపారు.
మిగ్-23యుద్ద విమానం రెండింతల వేగంతో దూసుకు పోయే యుద్ద విమనాంగ ప్రసిద్ధి చెందిందని ఆయన తెలిపారు.
20 ఏళ్ల వయస్సులోనే భద్రతా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరప్రదేశ్, శ్రీనగర్, అమృతసర్ వంటి ప్రాంతాల్లో పని చేసినట్లు ఆయన తెలిపారు.
తాజాగా కాశ్మీర్ లో జరిగిన ఘటన పై ఆయన స్పందిస్తూ మతం పేరుతో జరిగే హింసాత్మక చర్యలను సంఘటితంగా ఖండించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పాకిస్థాన్ అండతో జరిగిన ఈ ఉగ్రవాద చర్యను యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించిందన్నారు.
లష్కరే తోయిబాబకు చెందిన గ్రూప్ జరిపిన దుశ్చర్యకు ప్రతిగా భారతదేశానికి ప్రతిస్పందించాల్సిన హక్కు ఉందని ఆయన తేల్చిచెప్పారు.తాజాగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు అందుకు నిదర్శనమన్నారు.
కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆపరేషన్ సిందూర్ పేరుతో రఫెల్ జెట్లు,ద్రోణులు వినియోగించడాన్ని ఆయన సమర్దించారు.
పాక్ ఆక్రమిత భూభాగాన్ని కాశ్మీర్ లో కలుపు కోవడమే ఈ సమస్యకు ముగింపు అని,ఇది నా వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
జమ్మూలో జరిగిన దాడిపై భారత్ స్పందించడాన్ని ఆయన సమర్ధిస్తూనే భవిష్యత్ లో ఈ తరహా దాడులు ఉత్పన్నం అయితే పాకిస్థాన్ కు ఏ దేశం సైనిక సహాయం అందించదన్నారు.
యుద్ధమే వస్తే ఏర్పడే పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ పూర్తి స్థాయిలో యుద్ధం వస్తే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.