తెల్ల రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ.. మరోసారి స్పష్టం చేసిన మంత్రి
నిరుపేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 26 Jan 2025 8:00 PM ISTనిరుపేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లమంజూరు, తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం భోనగిరి యాదాద్రి జిల్లా భోనగిరి నియోజకవర్గ పరిధిలోని వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామంలో ప్రారంభించారు.
భోనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సి, ఎస్టీ, బి.సి మైనారిటీ లతో పాటు ఇ. బి.సి విద్యార్థి, యువజనల పురోగతితో పాటు యావత్ తెలంగాణా రైతాంగానికి చేయూత నందిస్తున్నామని ఆయన చెప్పారు. పేదప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వారి వారి జీవన ప్రమాణాలు పెంపొందించేలా సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చామని ఆయన తెలిపారు. చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు
మరుగున పడి పోయిన పంట భీమా పధకం పునరుద్ధరించడంతో పాటు వ్యవసాయ యోగ్యమైన భూములలో పంటలు వేసినా, వేయక పోయిన రైతు భరోసా పధకం కింద ఎకరాకు సంవత్సరానికి 1200 అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెల్ల రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అర్హత ఉండి తెల్ల రేషన్ కార్డు పొందలేక పోయిన చివరి లబ్ధిదారుడికి అందేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అంతే గాకుండా ఉన్న రేషన్ కార్డులలో అదనపు చేర్పులు కుడా కొనసాగుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు
గడిచిన పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చెయ్యని బి ఆర్ ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుల మంజూరుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పసలేని ఆరోపణలతో.. ప్రజలను పక్కదోవ పట్టించేందుకే బి ఆర్ ఎస్ పార్టీ పూనుకుందని ఆయన విమర్శించారు. బి ఆర్ ఎస్ పాలనలో ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలలో మాత్రమే తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారని అటువంటి బి ఆర్ ఎస్ నేతలు.. పారదర్శకంగా పనిచేస్తున్న తమ పై ఆరోపణలకు దిగడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.