హైదరాబాద్: తన పరిధిలోని శాఖలు, కార్పోరేషన్ల ఉద్యోగులు విధులకు ఆలస్యంగా హాజరుకావడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తన మంత్రిత్వశాఖ పరిధిలోని శాఖలు మరియు కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉదయం 10.40 వరకు కూడా తమ విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాని ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుండి ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటలకు వరకు విధులకు హాజరుకావాలని, హాజరుకాని ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులంతా రైతులకు అందుబాటులో ఉండేవిధంగా పనిచేయాలని, రైతులకు కావాల్సిన టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని, పంటలు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
రాష్ట్రంలో యూరియా పరిస్థితులపైనా మంత్రి తుమ్మల రివ్యూ చేశారు. రాష్ట్రానికి వస్తున్న యూరియాను డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాల వారిగా కేటాయించాలని, అలాగే బుధవారం జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం వివరాలు త్వరగా సేకరించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు.