యూరియా యాప్‌ను కేంద్రం అభినందించింది.. రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తెస్తాం: మంత్రి తుమ్మల

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల తెలిపారు

By -  Knakam Karthik
Published on : 20 Jan 2026 5:30 PM IST

Telangana, Minister Tummala, Fertilizer App, Congress Government, Union Fertilizer Department

యూరియా యాప్‌ను కేంద్రం అభినందించింది..రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తెస్తాం: మంత్రి తుమ్మల

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల తెలిపారు. వచ్చే ఖరీఫ్ కల్లా ఈ యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తేవాలని అన్నారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో-ఆపరేషన్ మరియు హార్టికల్చర్ శాఖల పురోగతిపై వ్యవసాయశాఖ సెక్రటరి మరియు ఆయా శాఖల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం మరియు తెలంగాణ విజన్ 2047 కార్యాచరణ ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు రైతులకు పూర్తిస్థాయిలో చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నప్పటికి, మార్కెట్లో నకిలీ ఆర్గానిక్ లేబుల్లతో నకిలీ ఉత్పత్తులు చలామణీ అవుతున్నందున నిజమైన ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు నష్టం చేకూరుతుందని మంత్రి అన్నారు. ఇందుకోసం వ్యవసాయశాఖ ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా ఒక యాప్ తీసుకురానుందని అన్నారు. ఈ యాప్ ద్వారా కొనుగోలుదారు తాను కొనబోయే ఉత్పత్తి ఎక్కడ, ఏ రైతు, ఎలా పండించాడో తెలుసుకుంటాడని అన్నారు. అదేవిధంగా అగ్రివర్సిటీలలోని ఖాళీ ప్రదేశాలలో ఆర్గానికి పంటలు పండించి, అక్కడే స్టాల్స్ పెట్టి అమ్మినట్లైతే రైతులు ఆర్గానిక్ పంటలవైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా 50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు రైతులకు కావాల్సిన యంత్రాలు మార్కెట్ ధరలకే లభించేలా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా రైతులకు చేరేలా నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పట్టించుకోని కేంద్ర ప్రాయోజిత పథకాలను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం ఒకొక్కటిగా పునరుద్ధరిస్తోందని, అందులో భాగంగా ఈ సంవత్సరం వివిధ పథకాల క్రింద ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలని, కేంద్రం నుంచి వచ్చే ఒక్క పైసా కూడా వృథాగా తిరిగి వెళ్లకూడదని అధికారులకు సూచించారు.

వచ్చే ఖరీఫ్ నాటికి పెద్దమొత్తంలో యూరియా బఫర్ స్టాక్ లను నిల్వలో ఉంచుకోవాలని, భవిష్యత్తులో యూరియా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, రైల్వే రేక్ పాయింట్లను కూడా ఎరువుల పంపిణీకి తగ్గట్లుగా ఉండేలా, మరికొన్ని రైల్వే రేక్ పాయింట్లను అదనంగా ఏర్పాటు చేసేవిధంగా రైల్వే అధికారులను కోరాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాలకు బోనస్ ఇస్తున్నందున, పంటకాలనికి అనుగుణంగా వ్యవసాయశాఖ ద్వారా సన్న వడ్లలో మేలైన వంగడాలను సూచించాలని, రైతులు అట్టి రకాలను ఉత్పత్తి చేసి మంచిధర పొందేటట్లు చూడాలని అన్నారు.

అధికశాతం ఖచ్చితత్వంతో శాటిలైట్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంటల శాటిలైట్ మ్యాపింగ్ డేటా రావాలని అధికారులను ఆదేశించారు. 3 సంవత్సరాల పంటల శాటిలైట్ మ్యాపింగ్ తో డేటా అందించాలని, డేటా ఫైనలైజ్ చేసేముందు ఒకసారి అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల డిపాజిట్లు ప్రైవేట్ కమర్షియల్ బ్యాంకులలో కాకుండా కో-ఆపరేటివ్ మరియు అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకులలో చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అందుకోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.

Next Story