హైదరాబాద్: రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే.. వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని, దీనికి అనుగుణంగా కేబినెట్ సబ్‌కమిటీ రిపోర్ట్ రూపొందిస్తోందన్నారు. ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తామని తెలిపారు. అది కూడా విధివిధానాలు ఖరారు కాగానే రైతుల ఖాతాల్లో పంట సాయం వేస్తామన్నారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉండి క్లారిఫై కానీ రైతు కుటుంబాలను గుర్తించి.. డిసెంబరులోగా వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు.
రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న వారికి షెడ్యూల్ ప్రకటించి అర్హులకు అమలు చేస్తామని చెప్పారు. 42 బ్యాంకుల నుంచి వచ్చిన వివరాల మేరుక 25 లక్షల కుటుంబాల్లోకి 42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమని తెలిపారు. ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశామని మంత్రి తెలిపారు. వైట్ రేషన్ కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబర్‌లో నిర్ధారణ చేసి రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. అలాగే వచ్చే సీజన్ నుండి పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు.