కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన తలసాని

Minister Talasani Srinivasa Yadav Fire On Kishan Reddy. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య వాదోపవాదనలు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  28 Dec 2022 6:45 PM IST
కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన తలసాని

తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య వాదోపవాదనలు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో, ఏ పనులు చేశారో చెప్పాలని నిలదీశారు. కనీసం ఆయన సికింద్రాబాద్ కు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకుంది రాజకీయ విమర్శలు చేయడానికేనా? అని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలపై బీజేపీ నేతలకు చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తే ఇక కేసు లేనట్టే అనే విధంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తలసాని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సంబరాలు చేసుకోవడానికి న్యాయస్థానం ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా...? అని తలసాని ప్రశ్నించారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ వారి జేబు సంస్థ సీబీఐకి చిక్కిందన్న ఆనందంతో కిషన్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవారని, ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ గా మారిందని విమర్శించారు. ఒకప్పుడు కేసును సీబీఐకి అప్పగిస్తే నిందితులు హడలిపోయేవారని, కానీ ఇప్పుడు సీబీఐకి కేసు అప్పగిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, బీజేపీ హయాంలో సీబీఐ పరిస్థితి ఎలా తయారైందో దీన్ని బట్టే తెలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులైన స్వామీజీలతో తమకు సంబంధం లేదన్నవారు, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని కేటీఆర్ నిలదీశారు.


Next Story