అవసరమైతే మొత్తం పబ్‌లనే క్లోజ్ చేస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud Warning to Pub Owners.డ్రగ్స్ వ్యవహారంతో తెలంగాణ పేరు బద్నాం అవుతోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ
By తోట వంశీ కుమార్ Published on 9 April 2022 2:28 PM ISTడ్రగ్స్ వ్యవహారంతో తెలంగాణ పేరు బద్నాం అవుతోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అసాంఘీక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో పబ్ నిర్వాహకులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పబ్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు ముఖ్యం కాదని.. అవసరం అయితే మొత్తం పబ్‌లే బంద్ చేస్తామంటూ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉన్న మంచి పేరు చెడిపోకుండా చూడాలని అందరికి సూచించారు. డ్రగ్స్ దందాలో ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో పేకాట, గుడుంబాను అరికట్టగలిగామని పేర్కొన్నారు. పబ్‌ల నిర్వహణ వెనుక ఎవ్వరు ఉన్న ఉపేక్షించబోమన్నారు. సొంత పార్టీ నేతలు ఉన్న వదిలి పెట్టకూడదు అని సీఎం ఆదేశించారన్నారు. డ్రగ్స్ దందా చేయాలనుకునే వాళ్లు రాష్ట్రం దాటి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో 61 పబ్‌లు ఉన్నాయని, ప్రతీ పబ్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు లేని పబ్‌లను వెంటనే సీజ్ చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాలు పెట్టిన తరువాతనే వాటిని తెరిచేందుకు అనుమతి ఇస్తామన్నారు.
శుక్ర, శనివారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాత్రి 12 గంటలకే పబ్‌లు క్లోజ్ చేయాలని, శుక్ర, శని వారాల్లో 1 గంట వరకు నడుపుకోవచ్చునని తెలిపారు. టైమ్ దాటాక కూడా పబ్‌లు నడిపితే ఆ పరిధిలోని పోలీస్, ఎక్సైజ్ అధికారులపై వేటు పడుతుందన్నారు. పబ్‌లపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగుతుందన్నారు. పబ్‌లో డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ పెడతామన్నారు. చట్టాన్ని ఉపయోగించి అవసరం అయితే నగర బహిష్కరణ చేస్తాం అంటూ సీరియస్‌గా హెచ్చరించారు.హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే రాష్టానికి అనేక పెట్టుబడులు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం దేశంలోనే నెంబర్ వన్‌గా రాష్టాన్ని నిలబెట్టడమని తెలిపారు.