ఒక మాజీ ఎంపీ, ఓ మాజీ మంత్రి కలిసి ఆడుతున్న నాటకం : శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud condemns 'affidavit tampering' allegations against him. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ఎలెక్షన్ అఫిడవిట్ పై జరుగుతున్న

By Medi Samrat  Published on  26 Jan 2022 1:57 PM GMT
ఒక మాజీ ఎంపీ, ఓ మాజీ మంత్రి కలిసి ఆడుతున్న నాటకం : శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ఎలెక్షన్ అఫిడవిట్ పై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. అనవసరంగా రచ్చ చేస్తున్నారని, తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి కలిసి ఆడుతున్న నాటకం ఇదని చెప్పారు. వీరెవరనే విషయాన్ని ఆధారాలతో సహా బయటపెడతానని అన్నారు. ఓటరు జాబితా నుంచి తన ఓటు తీయించే పని కూడా గతంలో వీరు చేశారని ఆరోపించారు. తన పేరు, తండ్రి పేరుతో సహా ఒక్కటే ఉన్న వ్యక్తితో నామినేషన్ వేయించారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చిన్న కులంలో పుట్టడమే నేరమా? ఇల్లు, కారు కొనుక్కోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. నేరుగా ఎదుర్కోలేకనే రండ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

బీఫామ్ తో పాటు ఇచ్చిన అఫిడవిట్టే ఫైనల్ అవుతుందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తాను నామినేషన్ వేసినప్పటి నుంచి కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేస్తున్నారని.. తన అఫిడవిట్ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారని.. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు దాన్ని డిస్మిస్ చేసిందని చెప్పారు. 2021లో ఈ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ముగించిందని తెలిపారు. ఇతర వ్యక్తులు వేసిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్నాయని చెప్పారు.

కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తన మీద ద్వేషంతో ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇది తెలంగాణపై కోపమా? లేక ఉద్యమ నాయకత్వంపై కోపమా? అని ఆయన ప్రశ్నించారు. వార్తలు రాసే ముందు కనీసం తెలుసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో మహబూబ్‌నగర్‌కి చెందిన ఓ మాజీ మంత్రి, ఓ మాజీ ఎంపీ హస్తముందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మహబూబ్‌నగర్‌లో రికార్డు మెజారిటీతో గెలిచానని.. తన ఎదుగుదలను ఓర్వలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


Next Story