తెలంగాణకు కాబోయే సీఎం.. కేటీఆర్‌: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Minister Srinivas Goud commented that the future CM of Telangana is KTR. కేసీఆర్‌.. ఆయన అనుకున్న స్థానంలోకి వెళితే ఇక్కడ సీఎం అయ్యేది కేటీఆరే అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

By అంజి  Published on  19 Oct 2022 1:05 PM IST
తెలంగాణకు కాబోయే సీఎం.. కేటీఆర్‌: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశాయి. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత సీఎం కేసీఆర్, కాబోయే సీఎం కేటీఆర్ అని అన్నారు. రాబోయే సీఎం మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారని తెలిపారు.

కేంద్రంలో కేసీఆర్‌.. ఆయన అనుకున్న స్థానంలోకి వెళితే ఇక్కడ సీఎం అయ్యేది కేటీఆరే అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కేసీఆర్ కుమారుడిగా కాదని, అన్ని అర్హతలున్న వ్యక్తిగానే కేటీఆర్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బైపోల్‌ ఎందుకు తెచ్చారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్‌కు భారత్‌ జోడో యాత్ర ముఖ్యమా? మునుగోడు బైపోల్‌ ముఖ్యమా? అంటూ ప్రశ్నించారు. నాయకులు జోడో యాత్రలో ఉంటే, క్యాడర్‌ అమ్ముడుపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

గతంలో చిరంజీవి ఇక్కడ పోటీ చేశారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ కూడా పోటీ చేయొచ్చునని.. టీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా? అన్నది ఎన్నికల్లో తేలుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. మునుగోడులో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ డ్రామాలాడుతోందన్నారు. ఈసీని తన చేతుల్లో పెట్టుకొని కారును పోలిన గుర్తులను పెట్టారన్నారు. ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకోని బీజేపీ నాటకాలు ఆడుతోందని, తెలంగాణను ఆగం చేసేందుకు కుట్రలు చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

Next Story