కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్టప్రకారం తాము ముందుకు వెళతామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నకిలీ వీడియోలు, ఫొటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఏమీ మాట్లాడలేమని తెలిపారు.
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న "హాయ్ హైదరాబాద్" అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టు చేసిన ఫొటోను స్మిత రీపోస్ట్ చేశారు. అందులో హెచ్‌సీయూ మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లు ఉంది. అలాగే వాటి ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్టుని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫొటోగా తేల్చారు. ఈ మేరకు BNS 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు.