హైదరాబాద్: తెలంగాణ అంగన్వాడీలు.. దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క అన్నారు. నిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ సేవలను మెరుగుపరచడం, పోషకాహార లోప నివారణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో చర్చించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని సూచించినట్టు వివరించారు.
వర్షాకాలంలో భవనాల సమస్యలను తక్షణం పరిష్కరించి, పిల్లల భద్రత, శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించానన్నారు. జిల్లా అధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించి, హాజరు శాతాన్ని పెంచాలని, నవంబర్ 19, ఇందిరా గాంధీ జయంతి నాటికి 1000 కొత్త అంగన్వాడీ భవనాల ప్రారంభానికి నిర్మాణాలు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేసినట్టు మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలోని చాలా చోట్ల అంగన్వాడీలను అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సొంత పక్కా భవనాలను నిర్మిస్తోంది.