అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో 14వేల పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క
నిరుద్యోగులు అయితే తమకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 5:23 AM GMTఅంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో 14వేల పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర అంశాలపై ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ఇక నిరుద్యోగులు అయితే తమకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం కొలువులను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ములుగులో సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగానే అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీపై వివరాలు చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా 4వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. మరోవైపు మహాలక్ష్మి పథకం గురించి స్పందించిన ఆమె.. ఆటో డ్రైవర్లు ఆందోళన చెందొద్దని చెప్పారు. వారి సంఘాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీ ప్రకటించామని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని సీతక్క చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రకియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.