పేద ఆర్థిక నేపథ్యం ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆమె తెలిపారు.
ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండల కేంద్రంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్‌ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విద్యతో పాటు మంచి ఆహారాన్ని కూడా అందిస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌష్ ఆలం, ఇతర అధికారులు పాల్గొన్నారు.